srichalapathirao_com__books_cds
courtesy: http://www.srichalapathirao.com/index.html
http://www.mediafire.com/?19kuz47761s8u
http://www.youtube.com/watch?v=5m-4XIWOu5A&feature=youtu.be
ఈ లోకంలో జన్మించిన ప్రతి మానవుడు నేను ఎందుకు పుట్టాను? నేను ఏం చేయాలి? నా జీవిత పరమ లక్ష్యం ఏమిటి? అని తనను తాను ప్రశ్నించుకోవాలి. అలా ప్రశ్నించుకోగలిగినవాడే ఉత్తముడు. అతడే మహాత్ముడుగా పరమాత్మగా పరిణతి చెంది జన్మను సార్ధకం చేసుకుంటాడు.
అసలు మానవులందరిని 3 విధాలుగా విభాగించవచ్చు.
(1) సామాన్యులు :- ఈ జన్మలో మనం హాయిగా, ఆనందంగా, గొప్పగా బ్రతకాలి. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరు చూడొచ్చారు?- అనుకుంటూ; పూర్తిగా లౌకికమైన సుఖాలు, భోగాలు అనుభవించటమే ముఖ్యమనుకుంటూ; అందుకొరకు వీలయితే న్యాయంగాను, వీలు కాకపోతే అన్యాయంగానైనా సరే ధన సంపాదనగావిస్తూ జీవించేవారు సామాన్యులు. వీరికి ఏ శాస్త్రాలతోను పనిలేదు.
(2) మధ్యములు :- మనం ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో ఇప్పుడు సుఖంగా ఉన్నాం; అలాగే ఏ జన్మలోనో పాపం చేయడం వల్లనే ఇప్పుడు దుఃఖాలు కూడా అనుభవిస్తున్నాం; కనుక ఇక ముందు జన్మలలో ఏ దుఃఖాలు లేకుండా సుఖంగా జీవించడానికి; అలాగే ఫై లోకాల్లో స్వర్గ సుఖాలు అనుభవించడానికి వీలుగా ఈ జన్మలో దానధర్మాలు, యజ్ఞయాగాలు, పూజా పునస్కారాలు, దైవకార్యాలు, సత్కార్యాలు చేస్తాను. అందుకోసం న్యాయబద్దంగా ధన సంపాదన చేస్తాను అని నిశ్చయించుకొని ఆ విధంగా జీవించేవారు మధ్యములు. వీరికి వేదాలలోని కర్మకాండ గురించి, పుణ్య కార్యాలకు సంబంధించిన గ్రంధాల గురించి తెలుసుకోవలసిన అవసరం ఉంది.
(3) ఉత్తములు :- మనం ఎలాంటి సుఖవంతమైన జన్మలను పొందినా ఆ జన్మలలో కూడా ఏవో దుఃఖాలు, బాధలు, భయాలు, అలజడులు, అశాంతి తప్పవుగనుక; ఒకవేళ మరణానంతరం కొంతకాలం స్వర్గసుఖాలు అనుభవించినా, తిరిగి ఈ లోకంలో సుఖ దుఖాలతో కూడిన జన్మలు తప్పవు గనుక; అసలు జన్మలేలేని శాశ్వతమైన ఆనంద స్వరూపంగా - ఆత్మ స్వరూపంగా ఉండిపోవాలని, అదే మోక్షమని గ్రహించి, అట్టి మోక్షప్రాప్తికే ఈ జీవితాన్ని అంకితం చేయాలని తపించేవారే ఉత్తములు. వీరికి పరమాత్మ యొక్క యదార్ధ తత్త్వాన్ని తెలియజెప్పే ఉపనిషత్తులను, మోక్ష ప్రాప్తికి మార్గం చూపే వేదాంత గ్రంధాలను తెలుసుకోవటం తప్పనిసరి. వీరే మానవులలో శ్రేష్ఠులు.
సామాన్యంగా ఈలోకంలో ప్రతివ్యక్తీ హాయిగా ఆనందంగా జీవించాలనుకుంటాడు. అందుకోసం ఎంతో శ్రమిస్తాడు. ఎన్నో విద్యలనభ్యసిస్తాడు. ఉద్యోగమో, వ్యాపారమో, వ్యవసాయమో, వృత్తులనో చేపట్టి ధనాన్ని సంపాదిస్తాడు. ఎన్నో వస్తువులను సమకూర్చుకుంటాడు, ఎన్నో భోగాలననుభవిస్తాడు. ఇంకా ఎన్నో ఎన్నెన్నో చేస్తాడు. ఐతే ఎన్ని చేసిన, ఎంత సంపాదించినా, హయిగా, ఆనందంగా ఏ కష్టం లేకుండా అసలు బాధలు, భయాలు లేకుండా జీవించగలుగుతున్నాడా? - లేదు. ఏదో కొరత, ఏవో కోరికలు, ఏదో అసంతృప్తి, ఏవో అలజడులు, ఆందోళనలు, అశాంతి. ఎన్ని సంపదలున్నా; ఎంత ధనాన్ని సంపాదించినా; ఎందరు అనుచరులు, సహచరులు ఉన్నా; ఎన్ని పదవులున్నా ఈ కొరతలు, కోరికలు, భయాలు, బాధలు, దుఃఖాలు, అశాంతి తప్పటం లేదు. ఎందుకు ?
ఎందుకంటే - తనకు కావలసింది ఏ దుఖమూలేని నిత్యమైన ఆనందం. కాని లభిస్తున్నది మాత్రం దుఃఖాలతో కూడిన అనిత్యమైన ఆనందం. అందుకే అసంతృప్తి - అశాంతి. ఎందుకిలా జరుగుతున్నది?
ఎందుకంటే నిత్యమైన ఆనదం కావాలంటే నిత్యవస్తువును పట్టుకోవాలి. అనిత్యమైన ఈ ప్రాపంచిక వస్తువులను పట్టుకుంటే అనిత్యమైన ఆనందమే గానీ నిత్యమైన ఆనందం లభించదు. మనం కోరేది నిత్యమైన ఆనందాన్ని. కానీ పట్టుకుంటున్నది అనిత్యమైన ప్రాపంచికమైన ధనసంపదలను, వస్తువులను, విషయాలను. అందుకే ఈ అసంతృప్తి - అశాంతి.
మరి నిత్యమైన ఆనదం కావాలంటే నిత్య వస్తువును పట్టుకోవాలిగదా! ఏమిటా నిత్యవస్తువు? "నిత్య వస్త్వేకం బ్రహ్మ తద్వ్యతిరిక్తం సర్వం అనిత్యం" - నిత్యమైన వస్తువు ఏకమైన బ్రహ్మమే (పరమాత్మే). పరమాత్మ కన్నా వేరైనవన్నీ అనిత్యమైనవే - అని శ్రీ శంకరభగవత్పాదులవారు 'తత్త్వ బోధ' లో తెలియజేశారు. కనుక మనం ఎట్టి దుఃఖమూ లేశ మాత్రం కూడా లేని శాశ్వతమైన - అఖండమైన - అనంతమైన ఆనందాన్ని పొందాలంటే ఆ పరబ్రహ్మన్నే (పరమాత్మనే) పట్టుకోవాలి. ఆ పరమాత్మతో ఐక్యమైపోవాలి.
ఐతే ఎవరా పరమాత్మ? ఎలా ఉంటాడు? ఎక్కడుంటాడు? ఆయనను తెలుసుకోవటం ఎలా? ఆయన వైపుకు ప్రయాణించటం ఎలా? ఆయనను పట్టుకోవటం ఎలా? ఆయనతో ఐక్యమై పోవటం ఎలా? ఇవే ముఖ్యమైన ప్రశ్నలు. ఈ ప్రశ్నలన్నింటికి చక్కగా సమాధానాలు చెప్పేవే 'ఉపనిషత్తులు'. ఐతే వేదాలకు అంతంలో ఉన్న జ్ఞాన భాండాగారాలైన ఈ ఉపనిషత్తులను అర్ధం చేసుకోవటం అల్పాయుష్కులు, అల్ప జ్ఞానులు ఐన ఈ కలియుగ మానవులకు కష్ట సాధ్యమని భావించి శ్రీకృష్ణభగవానుడు కలియుగ ప్రారంభానికి ముందే - అంటే ద్వాపరయుగం చివరిలో కురుక్షేత్ర యుద్ధరంగ మద్యములో అర్జునుని నిమిత్తంగా చేసికొని, సమస్త మానవాళి శ్రేయస్సు కొరకు ఉపనిషత్తుల సారాన్ని 'భగవద్గీత' గా ప్రసాదించటం జరిగింది.
కనుక మోక్షార్ది ఈ భగవద్గీతను కొన్ని ముఖ్య ఉపనిషత్తులను సంపూర్ణంగా తెలుసుకొని శాస్త్ర హృదయాన్ని అర్ధం చేసుకోవాలి. అలా అర్ధం చేసుకోవాలంటే ఒక సద్గురువు ద్వారా వీటిని 'శ్రవణం'చేయాలి. అప్పుడే ఈ అద్భుత ఆధ్యాత్మిక జ్ఞానం అవగతమౌతుంది. ఇలా శ్రవణం చేసి తెలుసుకున్న జ్ఞానాన్ని మళ్ళీ మళ్ళీ 'మననం' చేసుకుంటూ స్దిరపరచుకుంటూ, 'నిరిధ్యాసన' ద్వారా - అంటే ఈ జ్ఞానంఫై తదేక ధ్యాసనుంచటం ద్వారా, సాధనాల ద్వారా అనుభవానికి తెచ్చుకోవాలి. అప్పుడే శాశ్వతమైన, అఖండమైన ఆనందం. అదే మోక్ష స్ధితి. ఆ స్దితినందుకొనుటకే ఈ మానవ జన్మ వచ్చింది.
నిజమే, కానీ ఈ భగవద్గీత లేదా ఉపనిషత్తుల జ్ఞానాన్ని శ్రవణం చేయాలంటే మనలో తప్పనిసరిగా అర్హత ఉండాలి. ఏమిటా అర్హత?
1. మన మనస్సు ప్రశాంతంగా నిర్మలంగా ఉండాలి.
2. బుద్ధి సూక్ష్మంగా ఉండాలి.
3. గురువుపై అచంచలమైన విశ్వాసం ఉండాలి.
4. భగవంతుని కొరకు తపించాలి.
5. ప్రాపంచిక విషయాలపట్ల, భోగాల పట్ల ఆసక్తి తగ్గిపోవాలి.
ఈ లక్ష్యాలను సాధించటానికి మనకు మహాత్ములు అనేక ప్రకరణ గ్రంధాలను, ఇతిహాసాలను, భాగవతాది భక్తి ప్రబోధక గ్రంధాలను అందించారు. వాటిని శ్రద్ధగా తెలుసుకుంటే మనకు అర్హత లభిస్తుంది. దానితో భగవద్గీత, ఉపనిషత్తుల హృదయాన్ని శ్రవణం ద్వారా గ్రహించవచ్చు. అలా గ్రహించి చివరకు పరమాత్మ అంటే నా కన్నా వేరు కాదు. అది నా స్వరూపమే. అది నేనే (సో౭హం), 'అహంబ్రహ్మస్మి' అనే అనుభవాన్ని పొందవచ్చు. అదే మోక్షం. అప్పుడే జన్మరాహిత్యం; శాశ్వత ఆనందం.
మనం పుట్టింది నిజంగా ఈ మోక్షప్రాప్తి కొరకే, మనం చేయవలసింది ఈ మొక్షసాధనే. మన జీవిత పరమ లక్ష్యం ఈ మోక్షమే. దీనిని అందుకుంటేనే శాశ్వతమైన, అఖండమైన, అనంతమైన ఆనందం. అప్పుడే మానవజన్మ సార్ధకం, లేనిచో వ్యర్ధం.
ఈ లక్ష్య సాధన కొరకే గత 20 సంవత్సరాలుగా 'ఆధ్యాత్మిక జ్ఞాన పీఠం' ద్వారా మొక్షార్దులైన శిష్యులకు ప్రవచనముల ద్వారా; జప, ధ్యాన, సాక్షీ భావన, ఆత్మ నిష్ఠ మొదలైన సాధనల ద్వారా శిక్షణ ఇవ్వటం జరుగుతున్నది.
ఈ లక్ష్య సాధన కొరకే ఇప్పుడీ వెబ్సైటు ద్వారా - జన్మ సార్ధకం చేసుకోవాలని కోరుకొనే మోక్షార్దులందరికీ వివిధ శాస్త్ర గ్రంధాలపై, ప్రకరణ గ్రంధాలపై, ఇతిహాసాలపై, భాగవతాది గ్రంధాలపై ప్రవచనముల ద్వారా మార్గ దర్శనం చేయబడుతున్నది.
ఏ ఏ గ్రంధాలపై ప్రవచనాలు ఏ ఏ లక్ష్యాల సాధనకు ఉపయోగపడతాయో తెలిస్తే ఈ రంగంలో నూతనంగా ప్రవేశించిన వారికి కూడా మరింత ప్రయోజనం కలుగుతుందనే ఉద్దేశంతో ఆయా గ్రంధాల ప్రయోజనాలను సంక్షిప్తంగా క్రింద ఇవ్వడం జరిగింది.
(1) మానవ జీవితం యొక్క యదార్ధ స్ధితిని, మరణానంతరం ఆ జీవుడి ప్రయాణంలోను, తిరిగి తల్లి గర్భంలో ప్రవేశించేటప్పుడు, ఆ తరువాత గర్భంలో పెరిగేటప్పుడు పడే యాతనలను సంపూర్ణంగా తెలుసుకొనుటకు "జీవుల సుడిగుండాలు"
(2) దైనందిన జీవితంలో మనస్సును ప్రశాంతంగా ఉంచుకొనుటకు "ప్రశాంత జీవనానికి పదునెనిమిది సూత్రాలు"
(3) మానవ జీవిత లక్ష్యాన్ని తెలియజేయుటకు "మరణాన్ని మంగళప్రదం చేసుకో"
(4) పక్షి ఎగరాలంటే రెండు రెక్కలు ఎలా అవసరమో, అలాగే సాధకుడు మోక్ష సౌధాగ్రాన్ని చేరాలంటే వైరాగ్యం - ఆత్మ జ్ఞానం అనే రెండూ అవసరం గనుక ప్రాపంచిక విషయాల పట్ల వైరాగ్యం కలిగించి మనస్సును భగవంతుని వైపుకు త్రిప్పుటకు "శ్రీ శంకరభగవత్పాదుల వారి భజగోవిందం" అనే ప్రకరణ గ్రంధం.
(5) లౌకిక జీవనాన్ని ధర్మబద్ధంగా, నీతివంతంగా గడపటానికి, జన్మ సార్ధకతకు పునాది వేసుకొనుటకు "మహాభారత ప్రశస్తి - జీవన సత్యాలు"
(6) బుద్ధికి సూక్ష్మత్వం కలిగించటానికి "మహాభారతం : ధర్మా ధర్మ విశ్లేషణ ( మహాభారతం లోని ధర్మ సూక్ష్మాలు)"
(7) గురువుపై భక్తిని, విశ్వాసాన్ని పెంపొందించటానికి "గురుపధం శిష్యుని కర్తవ్యం"
(8) భగవద్గీతను, ఉపనిషత్తులను చక్కగా అర్ధం చేసుకొనుటకు -
గురుదేవుల "కర్మ సిద్ధాంతం"
శ్రీ శంకరాచార్యుల "తత్త్వబోధ"
రమణ మహర్షుల వారి "ఉపదేశ సారం"
సదాశివ బ్రహ్మెందులవారి "ఆత్మ విద్యా విలాసం" అనే ప్రకరణ గ్రంధాలు.
(9) భగవంతునిపై అనన్య భక్తిని కలిగించి, భగవంతునికై తపిస్తూ, భగవంతుని వైపుకు ప్రయాణించి ఆయనను సమీపించుటకు -
"శ్రీమద్భాగవతం"
"నారద భక్తి సూత్రములు"
(10) తెలుసుకున్న జ్ఞానాన్ని అనుభవంలోనికి తెచ్చుకొనుటకు "పరమార్ధ సాధనలు"
(11) మొక్షార్ధులకు సమగ్రమైన ఆత్మ జ్ఞానాన్ని అందించి పరిపక్వత చెందించటానికి, తద్వారా మోక్ష ప్రాప్తికి "భగవద్గీత" - 18 అధ్యయములతో కూడిన శాస్త్ర గ్రంధం.
(12) పరిపక్వత చెందిన సాధకులకు మోక్ష ప్రాప్తిని కలిగించే ముఖ్య ఉపనిషత్తులు -
(i) ఈశావాస్యోపనిషత్తు
(ii) కేనోపనిషత్తు
(iii) కఠోపనిషత్తు
(iv) ముండకోపనిషత్తు
(v) కైవల్యోపనిషత్తు - ఇవి ప్రధానంగా తెలుసుకోవలసిన గ్రంధాలు.
శ్లో || దుర్లభం త్రయమే వైతత్ దైవానుగ్రహహేతుకం |
మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయః || (వివేకచూడామణి)
తా|| "మానవ జన్మ రావటం, మొక్షాపేక్ష కలగటం, అందుకు మార్గాన్ని చూపే మహాత్ములతో సాంగత్యం ఏర్పడటం - అనే ఈ మూడు దుర్లభమైనవి. దైవానుగ్రహం ఉంటేనే లభించేవి" - అని శంకరాచార్యుల వారు వివేకచూడామణిలో తెలియజేశారు.
కనుక మోక్షాపేక్ష కలిగిన మానవులు ఈ పైన పేర్కొన్న గ్రంధాలపై ప్రవచనములను శ్రద్ధగా విని అవగతం చేసుకొనుట ద్వారా మానవ జీవిత పరమ లక్ష్యమైన మోక్ష ప్రాప్తికి పారమాత్మ అనుగ్రహం తప్పక లభించగలదని విశ్వసించి తమ తమ జీవితాలను సార్ధకం చేసుకొందురుగాక.